– ప్యాకేజీలతో పార్టీని నెట్టుకు రావడం సాధ్యమా…
– ఈ సంస్కృతే కింది(మండలం) వరకు పాకిందా..
– జాతీయ స్థాయి పార్టీలో ‘పెయిడ్’ కార్యకర్తలా..!
– ఇక పార్టీ సిద్ధాంతాలు, జోడో యాత్ర లక్ష్యాల అవగాహన ఏదీ
– ఇలాగైతే వచ్చే సార్వత్రిక ఎన్నికలు కత్తిమీద సాము లాంటివే
– కాంగ్రెస్ ను కలవరపెడుతున్న తాజా రాజకీయ పరిణామాలు
– పటిష్ట నాయకత్వం లేకనే ఈ పరేషాన్లు అంటున్న క్యాడర్
మన సమాజం మంచిర్యాల :
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ) అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీని నాయకత్వ లోపం వెక్కిరిస్తోందా..? ‘సరైనోడు’ లేకనే పార్టీ క్రమక్రమంగా బలహీన పడుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యంగా పెయిడ్, ప్యాకేజీ లీడర్లతోనే పరేషాన్ లు ఏర్పడుతున్నాయని కార్యకర్తలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్ లో పరిపక్వత కలిగిన నాయకులు ఉండాల్సింది పోయి ఎక్కడా లేని ‘పెయిడ్ అండ్ ప్యాకేజీల సంస్కృతిని మంచిర్యాల జిల్లాలో తీసుకొచ్చారనే ఆందోళన పీడిస్తోంది. ఇలాగైతే పార్టీని ముందుకు నడిపించడం ‘నల్లేరు మీద నడకే’ అని కూడా అంటున్నారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ కలవరానికి గురి చేస్తోన్న అంతర్గత వ్యవహారాలపై ‘మన సమాజం’ అందిస్తున్న ప్రత్యేక కథనం…
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యకర్తలనం ఒకింత అసహనానికి గురి చేస్తున్నాయి. సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం ఇక్కడ లేదన్న అసంతృప్తి ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇదే తరహా అభిప్రాయాన్ని వెలు బుచ్చుతున్నారు. దాదాపు తొమ్మిదిన్నర యేళ్ళుగా పార్టీ అధికారంలో లేక కొట్టు మిట్టాడుతున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలనే తపన డీసీసీలో కరువైందని స్వయంగా పార్టీ వర్గాలే మండి పడుతున్నాయి. దీనికంతటికీ పార్టీలో పుట్టుకొచ్చిన ‘పెయిడ్, ప్యాకేజీ’ విధానం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సమిష్టిగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి తీసుకు రావాలనే ఆరాటం లోపించిందని ఆవేదన చెందుతున్నారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటికైనా ఒక వ్యూహంతో కదిలితే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నందున కొంత కష్ట పడితే మంచి ఫలితాలు వస్తాయని కార్యకర్తలు భావిస్తున్నారు.
పలువురు పెయిడ్ నాయకులే..!
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న పలువురు నాయకులు పెయిడ్ విధానం రూపంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని సమాచారం. జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులైన వారికి ప్రతి నెలా వేతనాలు ఇస్తూ పార్టీని గుడ్డిలో మెల్లగా నడిపిస్తున్నారని తెలుస్తోంది. చివరికి పీసీసీ సభ్యుల స్థాయిలో ఉన్న వారు కూడా పెయిడ్ నాయకులని సాక్షాత్తూ పార్టీ కార్యకర్తలే ధృవీకరిస్తున్నారు. ఇకపోతే పై స్థాయి నేతలైతే ఏకంగా ప్యాకేజీ రూపంలో పని చేస్తున్నారని విశ్వసనీయంగా తెలియ వచ్చింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని భారీ స్థాయిలోనే ప్యాకేజీ కోసం చర్చలు సాగుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇప్పటి నుండే 8 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి బేరాలు, మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
జోడో యాత్ర లక్ష్యాల ప్రచారమేదీ..?
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రధాన లక్ష్యంతో అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా పార్టీలో కొత్త జోష్ నింపినట్లు అయ్యిందనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తదనంతరం హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని నేతలు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ ప్రచార విధానం, ఎజెండా పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అంతేకాకుండా జోడో యాత్ర స్టిక్కర్లు ప్రతి ఇంటికి అతికించాలని కూడా నిర్దేశించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో ఇవేవి కనిపించడం లేదని అంటున్నారు. ఒంటెద్దు పోకడలతోనే పార్టీని నెట్టుకు వస్తున్నారనే విమర్శలు ఈ సందర్భంగా వెల్లు వెత్తుతున్నాయి. ఒక మహత్తర ఆశయంతో ఈ యాత్ర చేపడితే స్థానిక నాయకులు విస్మరించడం సమంజసం కాదని చెబుతున్నారు. కనీసం యాత్ర ఎందుకోసం తలపెట్టారనేది చెప్పే వారు కరువయ్యారనే వేదన సర్వత్రా వినిపిస్తోంది.
బలోపేతం చేయడం అనివార్యం…
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నేటికైనా బలోపేతం చేయాలన్న అభిప్రాయాలు క్యాడర్ లో వ్యక్తం అవుతున్నాయి. నచ్చిన నాయకులతోనే నెట్టుకు రావాలనే ప్రయత్నం హర్షించదగ్గది కాదని పలువురు సూచిస్తున్నారు. ఒక సిద్దాంత పరమైన జాతీయ పార్టీలో పని చేస్తున్నప్పుడు అంకిత భావంతో పని చేస్తే బాగుంటుందని అంటున్నారు. కేవలం నెలనెలా వేతనాలు ఇచ్చే ఉద్యోగులుగా భావించి వారితోనే మేము మమ అనిపిస్తే పార్టీ పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారవుతుందని సాధారణ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో పీసీసీ నేతలు సైతం జిల్లాల వారీగా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు క్యాడర్ ను ఉత్తేజపరిచే విధంగా కృషి చేయాలని భావిస్తున్నారు. లేకుంటే ఈ పెయిడ్, ప్యాకేజీ లీడర్ల సంస్కృతి ఇంకా పాతుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా కానవస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం పరితపించే వారికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని అంటున్నారు.