మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: కస్టమ్ మిల్లింగ్ బియ్యంపై ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను రైస్ మిల్లర్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం రబీ, ఖరీఫ్ లో 2021-22 సంవత్సరానికి గాను 48 వేల 829 మెట్రిక్ టన్నులకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ఆహార భద్రత సంస్థ, పౌర సరఫరాల శాఖలకు కేటాయించిన బియ్యంను తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. గోదాములలో నిల్వ ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం నంబంధిత స్టాక్ రిజిస్టర్ ను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
మిల్లర్లకు అవసరమైన మేరకు గోనె సంచులను అందించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. మిల్లర్లు బాయిల్డ్ రైన్ తరలింపు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. ఇందుకు గాను రైస్ మిల్లర్లు 2021-22 కేటాయించిన లక్ష్యాలను రైస్ మిల్లర్ల యూనియన్ ప్రతినిధులతో సంప్రదించి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్కుమార్, రైస్ మిల్లర్లు, నంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.