Telugu Updates

ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈఓ..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలోని రైతు వేదికలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. జూలూరుపాడు మండల వ్యవసాయ విస్తరణ అధికారి బెజవాడ మణికంఠ 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా  ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ జూలూరుపాడు మండలం, పాపకొల్లు క్లస్టర్ పరిధిలోని అన్నారుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళా రైతు బాణోత్ చుక్కలి ఫిబ్రవరి నెలలో మరణించింది. చుక్కలి భర్త నగ్యా, కుమారుడు కళ్యాణ్ స్థానిక ఏఈఓ బెజవాడ మణికంఠ ను రైతు భీమా డబ్బులు ఇప్పించమని కోరగా అందుకు ఏఈఓ మణికంఠ వారి నుంచి 30వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు.15వేల రూపాయలు ఇస్తామని వ్యవసాయ అధికారికి తెలుపగా, పాపకొల్లు రైతు వేదిక లో ఉన్నాను, రైతు వేదిక వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ విస్తరణ అధికారి రైతు భీమా డబ్బులు ఇప్పించుటకు లంచం డిమాండ్ చేసిన విషయాన్ని నగ్యా కుమారుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన నేపధ్యంలో బుధవారం పాపకొల్లులోని రైతు వేదికలో ఏఈఓ మణికంఠ 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్, ఏసీబీ డీఎస్పీ 7901099400 కు సమాచారం అందించాలని తెలిపారు..