Telugu Updates

సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత..!

పుట్టినరోజు నాడే తుదిశ్వాస విడిచిన నటుడు

హైదరాబాద్: సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (92) కన్నుమూశారు. యూసఫ్ గూడ లొనీ తన నివాసంలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. పుట్టిన రోజు నాడే ఆయన కన్నుమూయడం విషాదకరం. యువకుడిగా ఉన్నప్పుడే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన బాలయ్య 300పైగా సినిమాల్లో నటించారు. ‘ఎత్తుకు పై ఎత్తు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు. వివిధ పాత్రలు పోషిస్తూనే.. నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. అమృత ఫిల్మ్స్ సంస్థ బ్యానర్ పై ‘చెల్లెలికాపురం’ (శోభన్ బాభు), ‘నేరము-శిక్ష’ (కృష్ణ), ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘ఊరికిచ్చిన మాట (చిరంజీవి) వంటి చిత్రాలు నిర్మించారు. ఇక, దర్శకుడిగా ‘పసుపు తాడు’, ‘నిజం చెబితే నేరమా’, ‘పోలీసు అల్లుడు’ సినిమాలు తెరకెక్కించారు. ‘ఊరికిచ్చిన మాట’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ‘చెల్లెలి కాపురం’ సినిమాకి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు..