Telugu Updates

ప్రాణహిత పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు..?

మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఈ నెల 13 నుండి 24వ తేదీ వరకు జరిగే ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ తెలిపారు. కలెక్టరేట్ లో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, దేవులవాడ, వేమనపల్లి మండలంలో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన రహదారి నుండి పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు అంతర్గత రోడ్లు, అప్రోచ్ రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ఏర్పాట్లు, నిర్వహణకు ఆయా శాఖలకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఘాట్ల వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా తాగునీరు, చలివేంద్రాలు, నీడ కోసం టెంట్లు, రాత్రివేళ విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓలు వేణు, శ్యామలదేవి, తదితరులు పాల్గొన్నారు.