ఆసిఫాబాద్ కు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!
ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్రీయ రహదారి రోడ్డు వెడల్పు పనులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జిల్లా వాసులకు త్వరలోనే రోడ్డు వెడల్పు పనులు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని రాష్ట్రీయ రహదారి విస్తరణ పనులకు గ్రామ పంచాయతీ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్ పోస్ట్ నుంచి ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వరకు రోడ్డు మధ్య నుంచి 66 ఫీట్ల వరకు ఆక్రమణలు తొలగించనున్నారు. అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా డీటీసీపీవో సాయికృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ ఆధ్వర్యం లో పంచాయతీ సిబ్బంది రోడ్డు మధ్య నుంచి ఇరు వైపులా 66 ఫీట్ల వరకు మార్కింగ్ ఇచ్చారు. రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాల్వల నిర్మాణంతో పాటు విస్తరణ పనులు చేపట్టనున్నారు. అటవీశాఖ చెక్ పోస్ట్ నుంచి ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వరకు వందల సంఖ్యలో కట్టడాలు ఉన్నాయి. వీటిని తొలగించేందుకు త్వరలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
యజమానులు సొంతంగా తొలగించేలా చర్యలు తీసుకోను న్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణంలోని ప్రధాన రహదారులను కూడా విస్తరించాలని వారు కోరుతున్నారు.