హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఏం చేయలేకే.. ఢిల్లీకి వెళ్లారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్కడ ధర్నా చేపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనే డిమాండ్ తో భాజపా శ్రేణులు సోమవారం ఇందిరాపార్క్ వద్ద ‘వడ్లు కొను.. లేదా గద్దె దిగు’ అనే నినాదంతో చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో లేని సమస్యను సీఎం కేసీఆర్ ఇక్కడ సృష్టించారని విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు తెరాసను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దొరల గడీల పాలనను భాజపా కూల్చుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.