రాయ్ రంగ్ పూర్: ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మూ. ఆమె గెలుపు నల్లేరుపై నడకే. ఆ స్థాయి వ్యక్తి గుడిలో తన నిరాడంబరతను చాటుకున్నారు. తన ఎంపికను పురస్కరించుకొని బుధవారం శివాలయానికి వెళ్లిన ఆమె.. స్వయంగా చీపురు పట్టి, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఇప్పటికే అనేక పదవులు చేపట్టిన ఆమె.. ఆ హోదాల్నీ పక్కన పెట్టి, ఈ తరహాలో తన భక్తిభావాన్ని చాటుకోవడం విశేషం. ద్రౌపది ముర్మూ ఈ రోజు తన స్వరాష్ట్రం ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన రాయిరంగ్ పూర్ లోని శివాలయానికి వెళ్లారు. గుడిలో నేరుగా దేవుడి దర్శనానికి వెళ్లకుండా.. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముర్మూకు జడ్ ప్లస్ భద్రత..?
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన ముర్మూకు కేంద్రం ఈ రోజు జడ్ ప్లస్ భద్రత కల్పించింది. దాంతో సీఆర్పీఎఫ్ కమాండోలు ఆమెకు రక్షణ కవచంలా ఉంటారని సంబంధిత అధికారులు వెల్లడించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్.. వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం అందించే రెండో అత్యున్నత స్థాయి రక్షణ కవచం..