గిరిజనులకు 10% రిజర్వేషన్లు
వారంలో జీవో జారీ- భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు
ఆదివాసి, బంజారా ఆత్మీయసభలో సీఎం కేసీఆర్ ప్రకటన
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తక్కువ జనాభాగా కనిపించిన గిరిజనులు అయిదారు శాతం రిజర్వేషన్ మాత్రమే పొందారు. తెలంగాణలో వారి జనాభా ఎక్కువ. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారని ప్రధానమంత్రిని, ఇక్కడికి వచ్చి విభజన రాజకీయం మొదలు పెట్టిన కేంద్ర హోం మంత్రి అమితాను అడుగుతున్నా.
-సీఎం కేసీఆర్
రాష్ట్రంలో వారం రోజుల్లోగా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల జీవో జారీ చేసి, అమలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. కేంద్రాన్ని అడిగి విసిగివేసారిపోయామని, మా జీవోను గౌరవిస్తారో.. లేదా దాన్ని ఉరితాడు చేసుకుంటారో ప్రధాని నరేంద్రమోదీ ఆలోచించుకోవాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని గుర్తుచేశారు. మరి తెలంగాణకు ఇవ్వడానికి ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. వెసులుబాటు చూసుకుని.. భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ఆదివాసి, బంజారాల ఆత్మీయ బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ఈ సభలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆదివాసీలు, బంజారాలు, గిరిజన గురుకుల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంజారా, గోండు భాషల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించి ఆకట్టుకున్నారు. సీఎం మాట్లాడుతూ..
‘దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు సంభవించే పరిణామాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే అయిదు నిమిషాల్లో ఇక్కడ జీవో విడుదల చేస్తాం. మా గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ఎందుకు తొక్కి పెడుతున్నారు? ఈ రోజు ప్రధాని మోదీ పుట్టినరోజు. మా బిల్లు వెంటనే రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. రాష్ట్రపతి కూడా ఆదివాసీ బిడ్డనే.. ఫైల్ పంపితే ఆపరు గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు గనులు ఎందుకు రావట్లేదు? అవి పక్కన పెడితే కనీసం గిరిజన రిజర్వేషన్లయినా ఇవ్వాలని కోరుతున్నాం’ అని కేసీఆర్ అన్నారు. రిజర్వేషన్లకు కేంద్రం వెంటనే ఆమోద ముద్ర వేయాలని సీఎం అన్నప్పుడు సభికులంతా చప్పట్లు మార్మోగించారు.