Telugu Updates

సీఎం కేసీఆర్ కు రాఖీలు కట్టిన ముగ్గురు అక్కలు, చెల్లెలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా ప్రేమ అప్యాయతలు, సహోదర భావాలు వెల్లివిరిశాయి. సోదరీమణుల రాకతో సీఎం నివాసంలో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడబిడ్డలను సీఎం సతీమణి శోభమ్మ సాదరంగా సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు..

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారి అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలు జరుపుకొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారు తమ సోదరుడిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఇదే సందర్భంలో సీఎం కేసీఆర్ మనుమడు, మనుమరాలు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లెలు అలేఖ్య రాఖీ కట్టింది. తన మనుమడు, మనుమరాలు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. వేడుకల్లో పాల్గొన్న పెద్దలు కూడా చిన్నారులను దీవించారు. మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు..