మంచిర్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో భారీ ధర్నా జరిగింది. శుక్రవారం ఎఐసిసి, టీపీసీసీ ఇచ్చిన పిలుపు, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ఐబి చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సారద్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు తోపాటు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, మహిళ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డివిరిచేలా ధరలు పెంచుతుందని ఆరోపించారు. నిత్యవసర సరుకులు మొదలుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచిందని ఆమె ధ్వజమెత్తారు. చివరకు చిన్న పిల్లలు రాసుకునే పెన్సిల్, ఏరేజర్ ధరలు కూడా పెంచారని ఆమె మండిపడ్డారు. సామాన్యులు తిరోగమనంలో పయనిస్తుండగా నరేంద్ర మోడీ మిత్రుడు అదాని మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోయాడని ఆమె అన్నారు.
రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సామాన్యులకు ఆర్థిక భారం కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె అభియోగించారు. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల సామాన్యులకు శిరోభారంగా మారిందని ఆమె తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులను, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్లనే గోదావరి తీర లోతట్టు ప్రాంతాలు నీటిమడుగుతున్నాయని ఆమె తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని సురేఖ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.