మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: కొవిడ్ వైరస్ నియంత్రణ దిశగా ప్రభుత్వం అందిస్తున్న బూస్టర్ డోస్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో బూస్టర్ డోస్ లు లభ్యమవుతాయని, అర్హత గల వారందర డోస్ తీసుకునే విధంగా ఆయా కేంద్రాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ పరిధిలోని సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో సి.డి.పి.ఓ.లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు వారి పరిధిలోని వారందరు బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బూస్టర్ డోస్ నిర్వహణ కొరకు ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని, జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకునే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలలో నెలకొన్న అపోహలను తొలగించే విధంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి రోజు 11 వేల డోసులుగా నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే విధంగా స్వయం సహాయ సంఘాల సభ్యులు, మహిళా సంఘాలు, పేదరిక నిర్మూలక సంస్థ సభ్యులు, గ్రామపంచాయతీల పరిధిలోని కమిటీల సభ్యులు అందరు సమిష్టిగా కృషి చేయాలని, ప్రతి రోజు బూస్టర్ డోసులు అందించిన వివరాలను సంబంధిత అధికారికి నివేదించాలని తెలిపారు. కొవిడ్ మొదటి, రెండు డోసులు అందించిన అనుభవం దృష్ట్యా బూస్టర్ డోస్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి జిల్లాలోని రేషన్ డీలర్లు, జర్నలిస్టులు, అర్హులందరికీ డోస్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఇన్చార్జ్ అధికారి డా॥ నీరజ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా॥ ఫయాజ్, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమకుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.