Telugu Updates

అభివృద్ధి ప్రామాణికంగా ఉత్తమ పంచాయతీల ఎంపిక

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గ్రామపంచాయతీల పరిధిలో జరిగే సంక్షేమ, అభివృద్ధి పనుల ప్రగతి ప్రామాణికంగా జాతీయ స్థాయి అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి గ్రామపంచాయతీ అవార్డులపై గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

జాతీయ పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియలో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు దరఖాస్తులను ఈ నెల 10 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలను పునర్వవస్థీకరించేందుకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అవార్డు కార్యక్రమం చేపట్టిందని, గ్రామపంచాయతీల పరిధిలో అభివృద్ధి, లక్ష్యసాధన సంబంధిత రంగాలలో స్థాయిల ఆధారంగా అవార్డుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఎస్.డి.జి.ల స్థానికీకరణకు సంబంధించి పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యం, పిల్లలు, మహిళల స్నేహపూర్వక గ్రామం, నీటి సమృద్ధి, స్వచ్ఛత, మౌళిక సదుపాయాలు, సురక్షితం, న్యాయం, సుపరిపాలనతో కూడిన గ్రామం ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, ఈ మేరకు పూర్తి సమాచారాన్ని అందించేందుకు పోర్టల్ అందుబాటులో ఉంటుందని, పంచాయతీలను మరింత శక్తివంతం చేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని తెలిపారు. 9 టీంలలో ఉన్న 113 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పొందుపర్చిన అనంతరం సబ్మిట్ చేయాలని, మార్పులకు అవకాశం ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల సవివరంగా ఆన్లైన్లో పొందుపర్చాలని, జిల్లాలోని గ్రామపంచాయతీలు జాతీయ అవార్డు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి బి. శేషాద్రి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.