Telugu Updates

రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు సరికాదు: మంత్రి

హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. యాదాద్రిలో భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం, వాష్ రూమ్స్ లో పరిశుభ్రత, కొండపై చలువ పందిళ్ల ఏర్పాటు, ఇతర వసతుల ఏర్పాటుపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా అకాల వర్షం వల్ల ఉత్పన్నమైన సమస్యలు, పునరుద్ధరణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా వర్షాకాలంలోగా అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టిసారించాలని సూచించారు. సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం జరిగేలా చూడాలని.. ఆలయం బయట భక్తులు సేద తీరేలా వసతి కల్పించాలని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు..