టెన్త్ విద్యార్థులకు హాల్టికెట్ ఉంటే ఉచిత ప్రయాణం..!
అమరావతి: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు. పరీక్ష కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో పాస్ లేకపోయినా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనుండగా.. ఈ సమయంలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి గురువారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పాస్ లేకపోయినా హాల్టికెట్ ఉంటే ప్రయాణానికి అనుమతించాలని పేర్కొన్నారు..
గేట్ మీటింగ్ ద్వారా సిబ్బందికి తెలియజేయాలని ఆర్టీసీ అధికారులకు ఈడీ సూచించారు. ఈ మేరకు జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులను సంప్రదించి, అవసరమైన బస్సులు నడపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.22 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు..