హైదరాబాద్: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. కరోనా నేపథ్యంలో నిరుపేదలు అకలితో అలమటించవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన పథకం లక్ష్యం నీరుగారుతోంది. సాక్షాత్తూ లబ్ధిదారుల కుటుంబాలు ఉచితం బియ్యాన్ని కారుచౌకగా చిరు వ్యాపారులకు అమ్ముకోవడం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం ఆహార భద్రత (రేషన్) కార్డులోని సభ్యుడి (యూనిట్)కి 10 కిలోల చొప్పున సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబానికి కనీసం 30 కిలోల నుంచి 60 కిలోల బియ్యం వరకు ఉచితంగా పంపిణీ జరుగుతోంది. ఉచిత బియ్యంపై అనాసక్తి ఉన్నప్పటికీ డ్రా చేయకుంటే కార్డు ఇన్ యాక్టివ్‌లో పడిపోయి రద్దవుతుందన్న అపోహతో అవసరం లేని లబ్ధి కుటుంబాలు సైతం బియ్యం డ్రా చేసి చిరు, వీధి వ్యాపారులకు కారుచౌకగా అప్పజేప్పేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బస్తీల్లో కొనుగోలు కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి.