Telugu Updates

రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై..?

సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలు ప్రత్యేక బోగీలో గవర్నర్ తమిళిసై

రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన

హైదరాబాద్: రెండురోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ తమిళిసై ఆదివారం రాత్రి రైలులో భద్రాచలం బయలుదేరారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దక్షిణమధ్య రైల్వే అధికారులు మణుగూరు ఎక్స్ ప్రెస్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోగీలో ఆమె కొత్తగూడెం వరకు రైలులో ప్రయాణించి.. అక్కడి నుంచి వాహనంలో భద్రాచలం చేరుకుంటారు. అంతకుముందు గవర్నర్ కు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ… రైలులో భద్రాచలం వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. సోమవారం సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే పట్టాభిషేకం కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. అనంతరం ఆమె వనవాసి కల్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే గిరిజన మహిళల సంప్రదాయ సీమంతం వేడుకకు హాజరవుతారు.

తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రాన్ని సందర్శించి, రెడ్ క్రాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ పనితీరును సమీక్షిస్తారు. ఆపై దమ్మాయి పేట మండలం నాచారంలోని జగదాంబసహిత జయలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మంగళవారం ఆమె జిల్లాలోని పూసుకుంట, గోగులపూడి ఆవాసాలకు చెందిన గిరిజన సముదాయాలను సందర్శించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మణుగూరులోని భారీ వాటర్ ప్లాంట్ ను పరిశీలిస్తారు..