Telugu Updates

ప్రధాని మోదీతో గవర్నర్ తమిళిసై భేటీ..?

రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి..

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యారు. దిల్లీలో ప్రధానితో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ప్రధానికి ఆమె వివరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రొటోకాల్ వివాదంపై మోదీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు..

సీఎస్ కు ప్రొటోకాల్ తెలియదా?
రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని తమిళిసై అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక పేరుని సేవారంగం నుంచి తనకు ప్రతిపాదించిందని.. ఆ వ్యక్తి ఎలాంటి సేవా చేయలేదని తాను భావించానన్నారు. తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని తెలిపారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు ప్రొటోకాల్ తెలియదా? అని గవర్నర్ ప్రశ్నించారు. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

నాకెలాంటి ఇగోలు లేవు..
రాజ్ భవన్ కు సీఎం, మంత్రులు ఎప్పుడైనా రావొచ్చని తమిళిసై చెప్పారు. ఎవరైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. తనను ఎవరూ అవమానించలేదని.. తనకెంలాంటి ఇగోలు లేవని వ్యాఖ్యానించారు. తాను వివాదాస్పద వ్యక్తిని కానందున వివాదాలను కోరుకోవట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధాని మోదీని కలవలేదని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలనేదే తన ఉద్దేశమన్నారు.

గిరిజన సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లా..
తెలంగాణ ప్రజలంటే ఇష్టమని.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరానని తెలిపారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రధాని దిశానిర్దేశం చేశారని చెప్పారు. మరోవైపు తెలంగాణలో గిరిజనుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తమిళిసై చెప్పారు. రాష్ట్రంలో 11 శాతం గిరిజన జనాభా ఉందని.. వాళ్ల సమస్యలపై తాను దృష్టి పెట్టిన విషయాన్ని మోదీకి తెలిపానన్నారు. ఇటీవల గిరిజన ప్రాంతాల పర్యటనల్లో సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని ప్రధానికి వివరించినట్లు చెప్పారు..