అవసరమైతే నూకలు తింటాం: హరీష్ రావు
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్రమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
హైదరాబాద్: యాసంగి ధాన్యం వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా… కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇదే అంశాన్ని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్రమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దేశంలో ఒకేరకమైన పరిస్థితులు ఉండవని, ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకలు తినాలని చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. అవసరమైతే నూకలు తింటామన్న హరీశ్ రావు.. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. తెలంగాణ సమాజం అవమానాన్ని సహించదని స్పష్టం చేశారు. “రైతుల పక్షాన ధాన్యం కొనండి అని అడగడం దమ్మీ కాదు.. డిమాండ్ చేయడం అవుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అవుతుంది తప్ప అది.. దమ్కీ కానే కాదు పీయూష్ గోయల్ గారూ! దమ్కీల సంస్కృతి మీది. ఆ అలవాటు మీకుంది. పచ్చ కళ్లద్దాలు పెట్టుకున్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు… దమ్కీలిచ్చే సంస్కృతి భాజపాది. మా రైతుల పక్షాన అడిగాం తప్ప…. మేమెక్కడా దమీలు ఇచ్చిన పరిస్థితి లేదు.
నూకలు తినమని మీరు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులు మర్చిపోలేదు. అన్నం తినో.. కలు బుక్కో.. 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. నూకలు తినమంటారా? అవసరమైతే నూకలు తింటాం.. మిమ్మల్ని గద్దె దించి తీరుతారు మా తెలంగాణ రైతులు. తెలంగాణ సమాజం దేన్నయినా సహిస్తది కానీ, అవమానాన్ని సహించదు. ఆనాడు తెలంగాణ ప్రజలను సమైక్య పాలకులు ఎట్లా అవమానపర్చారో.. ఇవాళ భాజపా నాయకులు పీయూష్ గోయల్ కూడా తెలంగాణ రైతాంగాన్ని, 70లక్షల మంది రైతులను అవమాన పరుస్తున్నారు. వక్రీకరిస్తున్నది మీరు.. వక్రీకరించి తెలంగాణ ప్రజల్ని అవమాన పరుస్తున్నది మీరు. ఏం మాట్లాడుతున్నారు పీయూష్ గోయల్ గారు.. డబ్ల్యూటీఓ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయట. అవేవో 1995లో చేశారు అని చెబుతున్నారు… మరి ఎనిమిదేళ్ల నుంచి మీరేం చేస్తున్నారు. డబ్ల్యూటీఓ ఒప్పందాలను మార్చగలిగే శక్తి రైతులకు ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ప్రధాన మంత్రి ప్రపంచమంతా తిరిగారు కదా..! దేశ రైతుల ప్రయోజనాల కోసం డబ్ల్యూటీఓ ఒప్పందాలను మార్చండి. ఒప్పించండి.. మెప్పించండి.. రైతుల ప్రయోజనాలు కాపాడండి. రైతుల హక్కులు కాపాడండి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.