మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా సగటు సముద్రమట్టం నుండి ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని, దీనితో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాలో పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు రోడ్ల వద్ద రాకపోకలు నిలిపి వేయాలని తెలిపారు.
జిల్లాలోని ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని, ఏమైనా ఇబ్బంది తలెత్తినట్లయితే వెంటనే సంబంధిత మండల స్థాయి, జిల్లాస్థాయి, అధికారులకు తెలియజేయాలని, భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, శిధిలావస్థలో ఉన్న భవనాలలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. వరద నీరు వచ్చే లోతట్టు ప్రాంతాలు ఉన్న గ్రామాలను గుర్తించి ప్రజలను అవసరమైన మేర సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోకి పైనుండి వరద నీరు అధిక మొత్తంలో చేరుతున్న దృష్ట్యా 30 గేట్ల ద్వారా ప్రాంతాలకు వదలడం జరిగిందని, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలు, వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవల కోసం 08736-250501, 250502 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.