ముంబయి: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్పీకర్ పదవికి ఎన్నిక పూర్తయింది. తలలు లెక్కించే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం కమలదళంతో చేతులు కలిపిన నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. భాజపా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే రాజన్ సాల్వికి 107 ఓట్లు దక్కాయి. కొత్తగా సీఎం పదవి చేపట్టిన ఏక్నాథ్ శిందే సర్కార్ సోమవారం బలపరీక్ష ఎదుర్కోనుంది. దీనికి ముందు స్పీకర్ ఎన్నిక జరగడంతో శిందేకు ఉన్న మద్దతు ఎంతో ఒకరోజు ముందే తెలిసిపోనుందని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. ఇప్పుడు నర్వేకర్ విజయం సాధించడంతో ఇప్పటి వరకూ శిందే శిబిరంలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలు అందరూ ఆయన వెంటే ఉన్నారని తేలిపోయింది..
రేపు జరిగే విశ్వాస పరీక్షలోనూ శిందే విజయం దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఎన్నికను బలపరీక్షకు సెమీ ఫైనల్గా అభివర్ణిస్తూ వస్తుండడం గమనార్హం. శాసనసభ సభాపతిగా ఉన్న నానా పటోలే గత ఏడాది ఫిబ్రవరిలో ఆ పదవికి రాజీనామా చేసి మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సభాపతి పోస్టు ఖాళీగా ఉంది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య రాష్ట్ర సీఎంగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన ఏక్నాథ్ శిందే బల నిరూపణ కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నేడు, రేపు జరుగుతున్న విషయం తెలిసిందే..