Telugu Updates

గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

మంచిర్యాల జిల్లా: గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం నుండి గూగుల్ మీట్ ద్వారా జిల్లాలోని డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి రోజు చెత్త సేకరణలో సిబ్బంది పనితీరు, ఇండ్ల నుండి వేర్వేరుగా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలింపుపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామంలో (శ్మశానవాటిక) నీరు, విద్యుత్ సరఫరా ఇతరత్రా పూర్తి సౌకర్యాలను కల్పించి వినియోగించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.

గ్రామపంచాయతీ పరిధిలో ఎలాంటి పన్ను బకాయిలు ఉండకుండా 100 శాతం వసూలు చేయాలని సూచించారు.. గ్రామాల పరిధిలో జరుగుచున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు..