వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వడలిపోతాయి.
అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వేసవిలో ఆహార పదార్థాలను తాజాగా ఉంచవచ్చు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..?
• ఫ్రిజ్ ఉష్ణోగ్రతను తగ్గించి 5 డిగ్రీల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. తాజా గుడ్లు, మాంసాన్ని తప్పకుండా ఫ్రిజ్లోనే పెట్టాలి. బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే వండిన పదార్థాలను, పచ్చి కూరగాయలను వేరువేరు అరల్లో సర్దుకోవాలి.
• దూరప్రయాణాలకు వెళ్తుంటే ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. వీలైతే కూల్ కంటైనర్ లో పెట్టడం మంచిది.
• పాలు, పులుసులు, కూరలు వంటి వాటిని కొద్ది గంటల వ్యవధితో తరచుగా వేడి చేస్తూ ఉండాలి. మరుగు వచ్చేంతవరకు స్టవ్ మీద ఉంచాలి.
• పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే ఫ్రిజ్ లోనే నిలువ చేయాలి. ఫ్రిజ్ లో ఇరుకిరుకుగా పెట్టకూడదు. గాలి ఆడేందుకు ఖాళీ ఉంచాలి. అప్పుడే అందులోని పదార్థాలు పాడవకుండా ఉంటాయి.
• ఫ్రిజ్ లోంచి తీసిన పదార్థాలను వెంటనే వండొద్దు. కాసేపటి తర్వాత వండుకోవాలి.
• వీలైనంత వరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తరిగాక, గాలి చొరబడని డబ్బాల్లో నిలువ చేయడం ఉత్తమం..