Telugu Updates

జవాన్ పెళ్లి కోసం ఆర్మీ ఏం చేసిందో తెలుసా..?

శ్రీనగర్: పెళ్లి చేసుకొనేందుకు ఇంటికెళ్లాల్సిన ఓ జవాన్ కోసం ప్రత్యేక హెలికాప్టర్ను నడిపింది భారత సైన్యం. జమ్ము-కశ్మీర్ లోని మచిల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద నారాయణ బెహెరా బీఎస్ఎఫ్ సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మే 2న ఒడిశాలోని స్వగ్రామంలో అతని వివాహం నిశ్చయమైంది. అయితే నారాయణ ఉన్న ఎత్తయిన ప్రదేశం ప్రస్తుతం మంచుతో నిండిపోయి రహదారి మార్గం మూసుకుపోయింది. దీంతో వివాహానికి వరుడు హాజరయ్యేది సందిగ్ధంగా మారింది. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. తమ కుమారుడు వచ్చేలా చూడాలని అతని తల్లిదండ్రులు ఆర్మీ అధికారుల్ని కోరారు. స్పందించిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్.. శ్రీనగర్ లో ఉన్న చీతా హెలికాప్టర్లో నారాయణ బెహెరాను తరలించాలని ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున అతన్ని హెలికాప్టర్లో ఎక్కించుకుని శ్రీనగర్కు తీసుకొచ్చారు. అక్కడినుంచి ఒడిశా దెంకనల్ జిల్లాలోని ఆదిపూర్ గ్రామానికి బయలుదేరాడు.