Telugu Updates

సీఎం కేసీఆర్ ఏం ప్రకటిస్తారో?… నిరుద్యోగుల్లో ఆసక్తి

హైదరాబాద్: నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో రేపు కీలక ప్రకటన చేయబోతున్నా. రేపు ఉదయం 10గంటలకు అందరూ టీవీల ముందు కూర్చోండి’ వనపర్తి సభలో తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించింది. సీఎం ఏం ప్రకటిస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగల భర్తీ కోసం యువత ఎంతోకాలగా ఎదురు చూస్తోంది. ఇదిగో.. అదిగో.. అంటూ పలుమార్లు ఉద్యోగ ప్రకటన చేస్తారని ప్రచారం జరిగినా నిరుద్యోగులకు ఎలాంటి ఊరట లభించలేదు.

గతంలో చేసిన కసరత్తు ప్రకారం వివిధశాఖల్లో దాదాపు 70వేలకు పైగా ఖాళీలు గుర్తించారు. వేతన సవరణ సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1,92,800 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అయితే, వాటిలో చాలా పోస్టుల స్థానంలో ఒప్పంద, పొరుగు సేవల పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో నికరంగా ఉండే ఖాళీల భర్తీని ప్రభుత్వం చేపట్టనుంది. లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కొత్త జిల్లాల ప్రకారం జోనల్ విధానం అమల్లోకి రావడంతో స్థానిక ఆధారంగా ఉద్యోగ నియామకాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను కూడా అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించే అవకాశముంది. సీఎం ప్రకటన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా కసరత్తు చేశారు. వనపర్తి పర్యటన నుంచి వచ్చాక సీఎం కేసీఆర్.. ఆర్థిక మంత్రి హరీశ్ రావు, అధికారులతో చర్చించారు.