Telugu Updates

మహిళా న్యాయవాది ఆత్మహత్య..?

హైదరాబాద్: నగరంలోని చందానగర్ లో విషాదం నెలకొంది. లక్ష్మీ విహార్ ఫేజ్- 1 డిఫెన్స్ కాలనీలో నివాసముంటున్న మహిళా న్యాయవాది శివాని.. భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శివాని ఐదేళ్ల కిందట అర్జున్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగడంతో శివాని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త అర్జున్ చందానగర్ పోలీసులకు లొంగిపోయాడు.

మృతురాలి తల్లి హేమ తెలిపిన వివరాల మేరకు..

శివానికి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో మేనమామ ఆమె బాధ్యతలు తీసుకొని న్యాయవాదిని చేశారు. శివానిని చదివించడంతో తాను అప్పుల పాలయ్యానని.. రూ.10లక్షలు ఇవ్వాలని మేనమామ వేధించేవాడు. పెళ్లి అయిన తర్వాత సంపాదన మేనమామకు ఎందుకిస్తావని భర్త అర్జున్ కూడా శివానిని వేధింపులకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. శనివారం మరోసారి జరిగిన గొడవతో విసిగిపోయిన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శివాని తన కుమారుడి రెండో పుట్టినరోజును ఇవాళ జరుపుకోవాల్సి ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకోవడం. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతురాలి తల్లి, సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డి వివరించారు..