Telugu Updates

నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలి

మంచిర్యాల జిల్లా: ఫీజుల పేరిట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పి.డి.ఎస్.యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాల శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సన్నీ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని రామంతాపూర్ లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ ధ్యేయంగా పనిచేస్తున్నాయని, కోర్సులకు రకరకాల అయిన పేర్లు పెడుతూ అమాయక విద్యార్థులను ఆకర్షించి లక్షల ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలను రద్దు చేస్తామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కంటే ఎక్కువ కాలేజీలు, స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం వారు చేస్తున్న ఫీజుల దోపిడీకి చట్టబద్ధత కల్పించడమే అన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల వేలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.