Telugu Updates

అధికారుల అలసత్వం రైతులకు నష్టం.!

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: రెబ్బెన మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు పంపిణీ చేసే ఎరువుల విషయంలో అలసత్వం వహిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు పీఏసీఎస్ చైర్మన్ కర్నాతం సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రెబ్బెన మండలంలో రైతులకు ప్రతి సంవత్సరం ఎరువుల పంపిణీ సకాలంలోనే సప్లయ్ చేసేవారని, కానీ ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రెబ్బెన సహకార సంఘానికి ఎరువులు రాలేదని అన్నారు. ఈ విషయమై దీనికి సంబంధించిన అధికారులను అడిగితే లైసెన్సు గడువు అయిపోయినందున రెన్యూవల్ చేయాలని, డోంగళ్ ఆక్టివేట్ అవడం లేదని, దాటవేసే కారణాలు చెపుతున్నారు.

ఇలా జరగడం వల్ల మండలంలోని రైతులు నష్టపోతున్నారు. మేము రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని ఈ సంఘంలో చైర్మన్ గా, వైస్ ఛైర్మన్ గా డైరెక్టర్లుగా ఉన్నాము కాని కొందరు అధికారుల వల్ల రైతులకు సమాధానం చెప్పుకోలేక పోతున్నాము. కావున ఈ సమస్యకు కారణమైనటువంటి అధికారులపై చర్యలు తీసుకొని యధావిధిగా ఎరువుల పంపిణీ కొనసాగించాలని రెబ్బెన మండల రైతుల తరుపున వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వేముర్ల సంతోష్, పీఏసీఎస్ డైరెక్టర్ అజయ్ కుమార్ జైస్వాల్ లు పాల్గొన్నారు.