Telugu Updates

ఐకమత్యంతోనే సమగ్రాభివృద్ధి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలందరు ఐకమత్యంతోనే కృషి చేసినప్పుడే రాష్ట్రంలో, దేశంలో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో 15 వేల మందితో చేపట్టిన షత్రోత్సవ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి ప్రారంభించారు. ర్యాలీ పట్టణంలోని బలాల్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమై కొత్త బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారి వెంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు నిర్వహించి, అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.

అభివృద్ధిలో ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని, 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి దేశమంతా నంబరాలు జరుపుకుంటున్న సమయంలో హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రం నిజాం పాలనలో ఉండేదని, కొమరంభీం, రాంజీ గోండు లాంటి ఎందరో మహానుభావులు చేసిన పోరాటాలు, త్యాగాల వలన 1948లో తెలంగాణ రాష్ట్రం దేశంలో విలీన చేయబడి నేడు మనం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తూ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. భావితరాల వారికి తెలంగాణ రాష్ట్ర చరిత్ర, మహనీయులు, పోరాటయోధుల త్యాగాలు తెలిసే విధంగా ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర అభివృద్ధి వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అపార సంపద ఉందని, బ్రిటీష్ మహారాణి కిరీటంలోకి కోహినూర్ వజ్రం తెలంగాణదేనని అన్నారు. కార్యక్రమం అనంతరం ర్యాలీలో పాల్గొన్న అందరికీ భోజనం అందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఎ.సి.పి. నరేందర్, చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సణ్ అర్చనాగిల్దా, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.