మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికెరీ
మంచిర్యాల జిల్లా: విద్యార్థినీ, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అన్ని రకాల మౌళిక సదుపాయాలతో అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో ఎంపికైన 248 పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో మన ఊరు – మన బడి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యక్రమంలో భాగంగా ఎంపికైన పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కార్యచరణ ప్రకారంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థాయిల వారిగా ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, పాఠశాలల భవనాలు క్రమపద్దతిలో ఉండే విధంగా రూపకల్పన చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఆయా మండలాలలో గ్రామాల వారిగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ. ఈ. జాదవ్ ప్రకాష్, రోడ్లు భవనాల శాఖ ఈ. ఈ. రాము, వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.