Telugu Updates

కేసీఆర్ తో.. పీకే భేటీ..!

ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత చర్చ

తాజా సర్వే నివేదిక ఇచ్చిన ప్రశాంత్ కిశోర్

తెరాసతో కలిసి పనిచేస్తానని వెల్లడి

రాత్రి ప్రగతిభవన్ లోనే బస

నేడూ కొనసాగనున్న సమాలోచనల

హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంతి కిశోర్ శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో పీకే హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆదివారం సైతం సమాలోచనలు కొనసాగనున్నాయి. ఇందుకోసం పీకే శనివారం రాత్రి ప్రగతిభవన్లోనే బస చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే తెరాసతో ఒప్పందం మేరకు పీకే రాష్ట్రంలో తమ బృందంతో కలిసి రాజకీయ, పాలన పరిస్థితులపై సర్వే నిర్వహించారు. తొలుత 30 నియోజకవర్గాల్లోని సర్వే ఫలితాలను ఇచ్చారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల సర్వే జరిగింది. పీకే ఆ నివేదికను కేసీఆర్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయన కాంగ్రెస్ నేతలతో జరిపిన సమావేశాల గురించి సైతం చర్చ జరిగినట్లు సమాచారం.

ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తాను తెరాసతో పనిచేస్తానని పీకే వెల్లడించినట్లు తెలుస్తోంది.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం కూడా చర్చలు కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రధానంగా ఈ నెల 27న తెరాస 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్లీనరీని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పీకే తాజా సర్వే, తెరాస బలోపేతం వంటి అంశాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.