టీఎస్ఎల్పీఆర్టీ పేరుతో నకిలీ వెబ్సైట్..
సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు..?
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో చేపట్టనున్న నియామకాల ప్రక్రియను నిర్వహిస్తున్న ‘తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ _ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ)’ పేరుతో అంతర్జాలంలో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వెబ్సైట్ ను సృష్టించారు. డీజీపీ కార్యాలయంలోని రిక్రూట్మెంట్ బోర్డు విభాగాధికారులు ఇంటర్నెట్ లో నకిలీ వెబ్సైట్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దీన్ని ఇంర్నెట్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ సహా ప్రత్యేక పోలీస్ విభాగం, అగ్నిమాపక, జైళ్లశాఖల్లో వేర్వేరు స్థాయిల్లో 16,614 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర రిక్రూట్మెంట్ బోర్డు ఏప్రిల్ 25న నోటిఫికేషన్లు జారీ చేసింది.
మే 2 నుంచి మే 20వరకూ టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సరిగ్గా ఇదే తరహాలో నకిలీ వెబ్సైట్ ను సృష్టించారు. అభ్యర్థులు అంతర్జాలంలో శోధించేటప్పుడు పొరపాటున నకిలీ వెబ్సైట్ ను తెరిచి పరీక్ష రుసుం చెల్లిస్తే అంతే సంగతి. దాంట్లో పూర్తి వివరాలు నమోదు చేస్తే. అసలు వెబ్సైట్ లో వారి దరఖాస్తు కనిపించదు. మొత్తంగా గందరగోళ పరిస్థితి ఎదురవుతుందని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఇంకా రెండ్రోజుల సమయం ఉండడంతో సాధ్యమైనంత వేగంగా నకిలీ వెబ్సైట్ ను తొలగించే చర్యల్లో పోలీస్ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు..