పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు..!
వరంగల్: వరంగల్ ఔటరు రింగురోడ్డు కోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) జారీ చేసిన భూసమీకరణ నోటిఫికేషన్ రద్దయింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం రాత్రి ‘కుడా’ వైస్ చైర్మన్ ఆదేశించారు. ఔటర్ రింగురోడ్డు 41 కిలోమీటర్ల కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలోని 28 గ్రామాల్లో భూసమీకరణ చేసేందుకు కుడా ఏప్రిల్ 30వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. భూములిచ్చేందుకు రైతులు, యజమానులు అంగీకరించకపోవడంతో భూసమీకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని అరవింద్కుమార్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్లో సోమవారం మంత్రి కేటీఆర్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కలిశారు. భూసమీకరణ నోటిఫికేషన్ లో రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కొనసాగుతున్న ఆందోళనలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ‘కుడా’ పరిధిలో భూసమీకరణ విధానాన్ని రద్దు చేయాలని మంత్రి కేటీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్ ను కోరారు.
నెల రోజులుగా రైతుల ఆందోళనలతో: వరంగల్ ఔటరు రింగురోడ్డు కోసం నెలరోజులుగా గ్రామాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. భూసమీకరణ కోసం జారీ చేసిన జీవో నంబరు 80 రద్దు చేయాలని గ్రామాల్లో ఉద్యమాలు తీవ్రం చేశారు. దీంతో నోటిఫికేషన్ రద్దు చేసేందుకు నిర్ణయించారు..