MANA SAMAJAM
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 5:27 pm Posted by : MANA SAMAJAM DESK

మైనర్‌తో మద్యం అమ్మకాలు..?

మందమర్రిలో పాలచెట్టు వైన్స్‌పై ఆరోపణలు

18 ఏళ్లు నిండని యువకుడితో మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న యాజమాన్యం

మంచిర్యాల జిల్లా.. మందమర్రి  పట్టణంలోని పాలచెట్టు వైన్స్ షాప్‌లో చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 18 సంవత్సరాలు నిండని బాలుడిని మద్యం అమ్మకాల కోసం కౌంటర్ వద్ద పెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలో సంచలనంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనర్లను మద్యం కొనుగోలు కోసం పంపించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తుంటే, అదే మైనర్‌తో మద్యం విక్రయాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్సైజ్ శాఖ మౌనం ఎందుకు..?

చట్టాలు సామాన్యులకేనా..? వైన్స్ యాజమాన్యాలకు వర్తించవా..? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.మైనర్లతో మద్యం విక్రయాలు చేయించడం తీవ్రమైన నేరమని, వెంటనే సంబంధిత వైన్స్ షాప్‌పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.