హైదరాబాద్: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్సైట్ www.tslprb.inలో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మరో ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2.54 లక్షల మంది అభ్యర్థులు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై పోస్టులకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు..