Telugu Updates

సోనియా అపాయింట్మెంట్ కోరిన కోమటిరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సోనియాకు వివరించాలనుకుంటున్నానని.. అందుకే అపాయింట్మెంట్ కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానంపై ఆమెను కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కూడా సోనియా అపాయింట్మెంట్ కోరారు. టీపీసీసీలో జరుగుతున్న పరిణామాలున వివరించనున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర కాంగ్రెస్ లో కల్లోలానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ లే కారణమని మర్రి శశిధర్ రెడ్డి బుధవారం విమర్శించారు. పలు టీవీ ఛానళ్లతో ఆయన విడివిడిగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ ఉంటూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకుసాగేలా దిశానిర్దేశం చేయాల్సిన మాణికం ఠాగూర్.. రేవంత్ రెడ్డి కి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని నేరుగా సోనియాగాంధీకి వివరించాలని ఆయన నిర్ణయించారు..