మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చదువుతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు అని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కార్మల్ కాన్వెంట్ హైస్కూల్ లో డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి హాజరై రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
ఏ రకమైన వృత్తిలో రాణించాలన్నా ఆ వ్యక్తిని తీర్చిదిద్దేది ఉ పాధ్యాయులేనని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని అన్నారు. ఎవరికైనా తల్లి మొదటి గురువు అని, విద్య అందించడం ఇంటి నుండే ప్రారంభమవుతుందని, తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు అని అన్నారు. విద్యార్థులకు చదువు నేర్పించి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా సిద్దం చేయడమే కాకుండా జీవితం అనే చదువును నేర్పించాలని అన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రుల కంటే అధిక సమయాన్ని పాఠశాలలో ఉపాధ్యాయులతో గడుపుతారని, ఉపాధ్యాయులు తమ పదవీ కాలంలో దాదాపు మూడు తరాల విద్యార్థులను వైద్యులు, ఇంజనీర్లతో పాటు అన్ని రంగాలలో ఉన్నతంగా తయారు చేస్తారని అన్నారు. పారిశుద్ధ్యం పాటించడంలో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల సిబ్బందితో పాటు పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని విద్యార్థులకు తెలియజేసి బ్యాలం నుండే పరిశుభ్రత, క్రమశిక్షణ బోధించాలని, అప్పుడు ప్రతి పాఠశాలలో శుభ్రత, పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు ఆరోగ్యంగా, మరింత ఉత్సాహంగా విద్య నభ్యసిస్తారని తెలిపారు.
వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరు బాధ్యతగా తీసుకోవాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులతో పాటు చుట్టుప్రక్కల వారికి తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని, నా ప్రాంతం, నా రాష్ట్రం, నా దేశం అనే బాధ్యత పిల్లలలో కల్పించాలని తెలిపారు. చిన్నతనం నుండి మంచి నడవడిక, సత్ప్రవర్తన, పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ అలవాటు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, ఉపాధ్యాయులు దానిని గుర్తించి వారిని ప్రోత్సహించి వెలికితీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.