Telugu Updates

తెలంగాణ విద్యా శాఖ కీలక ఆదేశాలు..?

తెలంగాణ: తెలంగాణలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్, టెన్త్ పరీక్షలపై గురువారం జిల్లాల కలెక్టర్లతో మంత్రి సబితా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు, టెన్త్ పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు.

ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరోగ్య శాఖ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సబితా సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ షాపులను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని చెప్పారు. ఇక పరీక్షా కేంద్రాల్లో సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని, అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని మంత్రి సబితా స్పష్టం చేశారు.