కొలంబో: శ్రీలంకలో గొటబాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొలంబోలో పార్లమెంట్ భవనం వద్ద శాంతియుతంగా నిరసనతెలుపుతున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో శ్రీలంక ఒక్కసారిగా భగ్గుమంది. ఇరు వర్గాల ఘర్షణలతో కొలంబో నగరం అట్టుడికింది. ఈ ఘర్షణల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకొరాల మృతిచెందారు. నిట్టాంబువలో ఎంపీ కారును ఆందోళనకారులు అడ్డుకోగా.. ఆయన ఎస్యూవీ కారు నుంచి తుపాకీ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన నిరసనకారులు ఎంపీ కారును ధ్వంసం చేయడంతో ఆయన ఓ భవనంలో ఆశ్రయం పొందారనీ.. అక్కడే తన రివాల్వర్ తో కాల్చుకున్నట్టుగా చెబుతున్నారు. ఆయన రివాల్వర్తో కాల్చుకొనే సమయంలో ఆ భవనం చుట్టూ వేలాది మంది జనం ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. అయితే, అక్కడ ఎంపీతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్వో) కూడా విగత జీవిగా పడి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇద్దరు మృతిచెందగా.. దాదాపు 100 మందికి పైగా గాయాలతో ఆస్పత్రిలో చేరినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కొలంబోలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో పాటు తక్షణ కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు ప్రకటించారు..