Telugu Updates

టెట్ నోటిఫికేషన్ లో స్పష్టీకరణ.?

టెట్ అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి

2015 డిసెంబరు తర్వాత ఇంటర్, డిగ్రీ పాసైన వారికి వర్తింపు

హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు దరఖాస్తు చేస్తున్నారా?.. మీరు 2015 డిసెంబరు 23 తర్వాత ఇంటర్ లేదా డిగ్రీ పూర్తిచేశారా? అయితే మీరు పొందిన మార్కుల శాతాన్ని పరిశీలించుకోవడం అవసరం. ఎందుకంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్ లేదా డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు మాత్రం 45 శాతం చాలు. అంటే పేపర్-1 రాసేవారికి ఇంటర్, పేపర్-2 రాసేవారికి డిగ్రీలో మార్కుల శాతాన్ని చూస్తారు. అంతకంటే తక్కువ ఉంటే వారు టెట్ రాయడానికి వీలుండదు. గతంలో ఈ నిబంధన లేదు. ఎందుకంటే టెట్ జీవో 2015 డిసెంబరు 23న ఇవ్వడం, ఆ తర్వాత 2016 మే, 2017 జులైలో టెట్ జరపడం వల్ల వాటికి హాజరయ్యేవారు జీవో కంటే ముందుగా పాసైన వారే ఉంటారు. ఈసారి జీవో విడుదల తర్వాత ఉత్తీర్ణులైనవారు ఉంటారు కాబట్టి మార్కుల నిబంధన విధించారు. అయితే 2015 కు ముందు పాసైన వారికి మాత్రం జనరల్ అభ్యర్థులకు 45, ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే చాలు. తొలిరోజు 4వేల దరఖాస్తులు: ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్)కు దరఖాస్తుల సమర్పణ ప్రారంభమైన మొదటి రోజు శనివారం 4 వేల మంది దరఖాస్తు చేశారని టెట్ సభ్య కార్యదర్శి రాధారెడ్డి తెలిపారు. ఏమైనా సమస్యలుంటే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు..