Telugu Updates

జాతీయ సమైఖ్యత పెంపొందించేలా వజ్రోత్సవ వేడుకలు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

మంచిర్యాల జిల్లా: దేశభక్తిని చాటి జాతీయ సమైఖ్యతను పెంపొందించేలా భారత వశ్రోత్సవ వేడుకలను ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి డి.జి.పి. మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో స్వతంత్ర భారత వబ్రోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశమంతా పండగ వాతావరణంలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు వేడుకల నిర్వహణ కొరకు కార్యచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 563 సినిమా థియేటర్లలో 6 నుండి 10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థుల కొరకు ఉదయం 10 గం॥లకు గాంధీ చిత్రం ప్రదర్శించడం జరుగుతుందని, ఈ చిత్రాన్ని విద్యార్థులంతా చూసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 8న నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నుంచి జెడ్.పి.టి.సి., ఎం.పి.పి.లు, రైతుబంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి సినిమా థియేటర్ యాజమాన్యం గాంధీ సినిమా సాటిలైట్ లింక్ డౌన్లోడ్ చేసుకోవాలని, దీనిని తహశిల్దార్, ఎస్.హెచ్.ఓ. ధృవీకరించాలని తెలిపారు. ఈ నెల 12న ప్రతి సిటీ కేబుల్ ఛానల్లో దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చేయాలని, సంబంధిత లింక్లను జిల్లా పౌరసంబంధాల అధికారుల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ.. ఈ నెల 8న నిర్వహించే ప్రారంభం కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులను తరలించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశామని, గాంధీ చిత్రం ప్రదర్శన కోసం జిల్లాలోని సినిమా థియేటర్లు సిద్ధంగా ఉన్నాయని, రేపటి వరకు లింక్ డౌన్ లోడ్ పూర్తవుతుందని తెలిపారు. జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వశ్రోత్సవ వేడుకలకు సంబంధించి కార్యక్రమాల అమలుకు కార్యచరణ ప్రకారంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డి.సి.పి. అఖిల్ మహాజన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..