Telugu Updates

బతికుండగానే శ్మశానవాటికకు..!

శ్మశానవాటికలో కొన ఊపిరితో లక్ష్మణా చారి

ఇంటి యజమాని అనుమతి నిరాకరణ… బతికుండగానే శ్మశానవాటికకు..?

అక్కడే తుది శ్వాస విడిచిన యువకుడు

ములుగు జిల్లా వెంకటాపూర్ : కొన ఊపిరితో ఉన్న ఓ యువకుడిని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకి రానీయకపోవడంతో బతికుండగానే శ్మశానవాటికకు తరలించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఆ యువకుడు శ్మశానంలో తుదిశ్వాస విడిచారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వడ్రంగి వృత్తి చేసే కేశోజు లక్ష్మణచారి (30) తల్లిదండ్రులు సోమయ్య, సరోజినితో కలిసి 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు లక్ష్మణచారి వెన్నెముకకు గాయమై నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. మంగళవారం సాయంత్రం అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను కుటుంబసభ్యులు తీసుకురాగా అద్దె ఇంటి యజమాని అడ్డుకున్నారు. చేసేది లేక లక్ష్మణాచారి కుటుంబ సభ్యులు అతన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. బుధవారం ఉదయం ఆయన మృతిచెందారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రాధిక, సర్పంచి అశోక్, పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులు గ్రామ సమీపంలోని మిషన్ భగీరథ నీటిట్యాంకు వద్దకు చేరుకుని అక్కడే ఆశ్రయం పొందుతామని తెలిపారు..