8 ఏళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ పాలకవర్గ సమావేశం.. కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్డీసీ)లో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడతామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల నుంచి సుమారు 1200 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 8 ఏళ్ల తర్వాత సమావేశమైన ఆర్టీసీ పాలకవర్గం దాదాపు 300 అంశాలపై విస్తృత చర్చ చేసింది. ఆర్టీసీలో పలు కీలక నిర్ణయాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. కారుణ్య నియామకాల విషయంలో వచ్చే వారం రోజుల్లో కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని సూచన ప్రాయంగా బాజిరెడ్డి చెప్పారు. డీజిల్ సెస్, టోల్ సెర్పై ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రానందున బోర్డు అనుమతి పొందినట్లు చెప్పారు. సంస్థను నష్టాల నుంచి బయట పడేసే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని.. వాణిజ్య భవనాల ద్వారా ఆదాయం పొందే ప్రణాళికపై సమావేశంలో చర్చించినట్లు బాజిరెడ్డి స్పష్టం చేశారు. దూరప్రాంతాలకు ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ కోచ్ నడపాలని తీర్మానించినట్లు తెలిపారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీకి భారీ స్థాయిలో నష్టం వచ్చిందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా జిల్లాల్లోనూ ప్రవేశ పెడతామని సజ్జనార్ తెలిపారు. తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాధారణ ప్రజలకు వైద్యం అందించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం లభించిందన్నారు. త్వరలో 1,060 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టెండర్లు వేసినట్లు వెల్లడించారు..