మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్దసంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. నగదు వేయకుండా రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. వెంటనే రైతులకు రైతు బంధు నగదు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పింగిలి రమేష్, తదితరులు పాల్గొన్నారు..