Telugu Updates

మహిళా సాధికారత ‘మాలవ్య ఆశ’ యం

మహిళా సాధికారత ‘మాలవ్య ఆశ’యం

– భారతదేశ ప్రతిష్టను చాటేందుకే ఆమె పరితపన
– భద్రతా విషయంలో మన దేశమే మిన్న అంటూ ప్రచారం
– 25 వేల కిలోమీటర్ల మేరకు సాగనున్న పయనం
– ఆశా మాలవ్య యువతకు ఆదర్శం
– ఆమె సైకిల్ యాత్ర విజయవంతం అవ్వాలి
– బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య ఆశాభావం

మందమర్రి, ఫిబ్రవరి 20, (మన సమాజం):
మధ్యప్రదేశ్ అథ్లెట్, పర్వతారోహకురాలు ఆశా మాలవ్య దేశ యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య అన్నారు. దేశం గర్వించే విధంగా చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం అవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సైక్లింగ్‌లో బంగారు పతక విజేత మిస్ ఆశా మాలవ్య(24) ఒంటరిగా సైకిల్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సోమవారం ఆమె బెల్లంపల్లి చేరుకున్నారు. ఏసీపీ సదయ్య ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మాలవ్య మనోధైర్యం ఎంతో అభినందనీయమని అన్నారు. ఆమెలోని చైతన్యాన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

మహిళా సాధికారత కోసమే..
మహిళల భద్రత, మహిళా సాధికారత విషయంలో భారతదేశం గొప్ప దేశమని ఆశా మాలవ్య విశ్వాసం. కనుకనే ఈ అంశాల్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు బయలుదేరారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఆశాకు సైకిల్, ఒక జీపీఎస్ ఇచ్చింది. మహత్తర ఆశయంతో చేపట్టిన భారతదేశ సైకిల్ యాత్ర 2022 నవంబర్ ఒకటవ తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి ప్రారంభమైంది. 2023 ఆగస్టు 15న తిరిగి ఈ యాత్ర ఢిల్లీకి చేరుకుంటుంది. మొత్తం ప్రయాణం 25 వేల కిలోమీటర్ల మేరకు ఆశా మాలవ్య యాత్ర కొనసాగనుంది. కాగా ఇప్పటి వరకు 9వేల 165 కిలోమీటర్ల దూరం యాత్ర జరిగింది. యాత్ర ముగింపు రోజు ఆమె ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానితో కలిసి తన పర్యటన వివరాలను వెల్లడించనున్నారు. అదేవిధంగా మహిళలతో సమావేశం కానున్నారు.

111 రోజుల యాత్ర పూర్తి…
ఆశా మాలవ్య యాత్ర నేటి వరకు 111 రోజులకు చేరుకుంది. తన పర్యటన సందర్భంగా ప్రజలతో ఆమె ముచ్చటిస్తున్నారు. అవగాహన పెంచుకుంటూ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 111 రోజులలో తన పర్యటన పూర్తి చేశారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆశా మాలవ్య బీపీఎడ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆమె తండ్రిని తన మూడు సంవత్సరాల వయస్సులో పోగొట్టుకున్నారు. మాలవ్యకు ప్రస్తుతం అమ్మ, ఒక అక్క ఉన్నారు. భారత్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వున్న టెన్జింగ్ ఖాన్, బీసీ రాయ్ శిఖరాలను అధిరోహించి ఆమె ఇప్పటికే రికార్డులు సృష్టించారు. భారతదేశ పర్యటనను పూర్తి చేసిన తర్వాత, ఆమె ఇతర దేశాలలో సైకిల్ పర్యటన చేయాలని అంటోంది మాలవ్య.